Singireddy Niranjan Reddy: మంత్రి కోమటిరెడ్డి గురువు వైఎస్సే మమ్మల్ని ఏం చేయలేకపోయారు: బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి

  • నల్గొండ నుంచే మరో ఉద్యమానికి పూనుకుంటున్నామన్న బీఆర్ఎస్ నేత
  • కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు ఏం చేయాలో తెలుసునని వ్యాఖ్య
  • కృష్ణా నీటి వాటాను తేల్చే వరకు పోరాటం ఆగదన్న నిరంజన్ రెడ్డి
Niranjan Reddy fires Congress government

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువు వైఎస్ రాజశేఖరరెడ్డే తమను ఏం చేయలేకపోయారని... ఇప్పుడు వీరేం చేస్తారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌తో సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... కేసీఆర్ నాయకత్వంలో కీలక సమావేశం జరిగినట్లు తెలిపారు. నల్గొండ నుంచే మరో ఉద్యమానికి పూనుకుంటున్నామన్నారు. ఈ నెల 13న నల్గొండ కేంద్రంలో భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. 

కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. అలాంటి కేసీఆర్‌కు ఏం చేయాలో బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. నల్గొండ సభ జరిగి తీరుతుందన్నారు. సభకు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్లి అయినా అనుమతి తెచ్చుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ సమావేశాన్ని చాలా తేలికగా తీసుకుందని విమర్శించారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అన్నారు. ఈ తప్పుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు... రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ అంశానికి సంబంధించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

కృష్ణా నీటి వాటాను తేల్చే వరకు తమ పోరాటం ఆగేది లేదన్నారు. తమ పోరాటం ఒక్క నల్గొండకు పరిమితం కాదని.. తెలంగాణలో గడప గడపకు తీసుకెళ్తామని హెచ్చరించారు. తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. రేవంత్ ప్రభుత్వ అనాలోచితంగా చేసిన తప్పిదం వల్ల తాగు నీరు, విద్యుత్ ఉత్పత్తికి కేఆర్ఎంబీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలను తిట్టడమే ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు.

More Telugu News