Imran Khan: ఇమ్రాన్ ఖాన్ తో పాటు భార్యకు కూడా ఏడేళ్ల జైలుశిక్ష

  • ఇప్పటికే రెండు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ కు జైలుశిక్ష
  • తాజాగా, చట్ట వ్యతిరేక వివాహం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష
  • 2018లో బుష్రా బీబీతో ఇమ్రాన్ వివాహం 
Court sentenced Imran Khan and wife seven years prison

ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్షకు గురైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో కేసులోనూ జైలు శిక్ష పడింది. చట్ట వ్యతిరేక వివాహం చేసుకున్నారన్న కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఈ కేసులో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018లో జరిగిన ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల వివాహం చట్ట వ్యతిరేకం అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 

గురువారం నాడు పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనుండగా, ఇమ్రాన్ ఇప్పటికే ఎన్నికలకు దూరమయ్యారు. ఇప్పుడు వరుసగా జైలు శిక్షల రూపంలో దెబ్బ మీద దెబ్బ పడుతోంది. 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ కు అధికారిక రహస్యాల లీకేజి కేసులో 10 ఏళ్లు, ప్రభుత్వ కానుకల అక్రమ అమ్మకం కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. 

తాజాగా చట్ట వ్యతిరేక వివాహం కేసులో ఇమ్రాన్ కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. 5 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా కూడా విధించారు. 

బుష్రా బీబీకి ఇమ్రాన్ తో పెళ్లికి ముందే మరో వ్యక్తితో వివాహం జరిగింది. ముందు భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిర్దేశిత విరామం (ఇద్దత్) పూర్తి కాకముందే ఇమ్రాన్ ను పెళ్లాడినట్టు బుష్రా బీబీపై అభియోగాలు మోపారు. ఈ కేసులోనే ఇమ్రాన్ కు, బుష్రా బీబీకి తాజాగా శిక్ష పడింది.

More Telugu News