ఉదయం రాజీనామా.. సాయంత్రం ప్రమాణస్వీకారం.. రెండేళ్ల వ్యవధిలో రెండోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్
- రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9వ సారి ప్రమాణం చేసిన జేడీయూ అధినేత
- ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే బీజేపీ మద్ధతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- ఎన్టీయేలో జేడీయూ చేరడం ఇక లాంఛనమే !
గత కొన్ని రోజులుగా బీహార్ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఆదివారంతో తొలగిపోయింది. మీడియా రిపోర్టులు పేర్కొన్నట్టుగానే నితీశ్ కుమార్ విపక్షాల ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించారు. అనంతరం గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో 18 నెలల కిందట మద్ధతు ఇచ్చిన ఆర్జేడీకి నితీశ్ పెద్ద షాక్ ఇచ్చారు. ఆర్జేడీతో పొత్తును ముగించుకుని ప్రతిపక్ష కూటమి నుంచి వైదొలగుతున్నట్టు నితీశ్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరడమే మిగిలి ఉంది.