Hanuman: ఆంజనేయస్వామి కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్

  • హైదరాబాదులో హనుమాన్ చిత్రబృందం కృతజ్ఞతా సమావేశం 
  • ముఖ్య అతిథిగా హాజరైన చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి
  • ఆసక్తికర పురాణ అంశాన్ని వెల్లడించిన వైనం
Chilukuru temple priest says Lord Hanuman decided to commit suicide at a point

ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిన్న సినిమా హనుమాన్ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తేజా సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం సంక్రాంతి కింగ్ గా నిలిచింది. 

కాగా, హనుమాన్ చిత్ర బృందం తాజాగా హైదరాబాదులో కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీనేజర్లలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, చాలామందికి తెలియని ఓ పురాణ అంశాన్ని ఆయన వెల్లడించారు. 

"ఇటీవల కాలంలో దేశంలో బాలబాలికలు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరం. కానీ, చాలామందికి తెలియని అంశం ఒకటుంది. ఓ దశలో ఆంజనేయస్వామి కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సీత జాడ కనుగొనేందుకు హనుమంతుడు లంక వస్తాడు. ఆ ద్వీపం మొత్తం గాలించినా సీతమ్మ ఆచూకీ దొరకదు.

సీతమ్మ కనిపించకపోతే, నేను ఇంత దూరం ఎగిరి వచ్చి కూడా విలువ ఏముంటుంది? లంకలో సీత కనిపించలేదు అంటే రాములవారి పరిస్థితి ఏంటి? అయోధ్య వాసుల పరిస్థితి ఏంటి? వానర సైన్యం పరిస్థితి ఏంటి? అని ఆంజనేయుడు తలపోశాడు. వారందరూ ఆత్మత్యాగం చేస్తారు అని అంచనా వేసుకున్నాడు. అందుకే, తాను కూడా ప్రాణత్యాగం చేయాలని ఆ వాయుపుత్రుడు నిర్ణయించుకున్నాడు. 

చెట్టుకు ఉరేసుకుని చనిపోతాను, లేక నిప్పు రగిల్చి అందులో దూకేస్తాను, సముద్రంలో పడిపోతాను, ఇవేవీ కాకపోతే అన్నపానీయాలు ముట్టకుండా కృంగి కృశించిపోతాను, నన్ను ఏదైనా క్షుద్ర జంతువు తినేసి వెళ్లిపోతుంది... అని హనుమంతుడు ఆత్మహత్య గురించి ఇలా రకరకాల ఆలోచనలు చేశాడు. 

మళ్లీ అంతలోనే ఆంజనేయుడు... నేను పోతే వాళ్లందరూ ఏమైపోతారు? అంటూ తనకు తానే కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు" అని రంగరాజన్ వివరించారు.

More Telugu News