Ganta Srinivasa Rao: రెండేళ్ల కిందట ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా... ఇప్పుడు ఆమోదించిన స్పీకర్

  • విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా గతంలో గంటా రాజీనామా
  • ఇప్పటిదాకా పెండింగ్ లో ఉంచిన అసెంబ్లీ స్పీకర్
  • త్వరలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక
  • కీలక సమయంలో గంటా రాజీనామా ఆమోదం!
Speaker approves Ganta Srinivasarao resignation after two years

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండేళ్ల కిందట స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. ఎవరూ ఊహించని విధంగా, అసెంబ్లీ స్పీకర్ ఇన్నాళ్ల తర్వాత గంటా రాజీనామాను ఆమోదించారు. 

ఏపీలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇవి పరోక్ష ఎన్నికలు కాగా, ఈ సమయంలో గంటా రాజీనామాను ఆమోదించడం వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. 

ఏపీలో కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేశ్ (బీజేపీ), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైసీపీ) పదవీకాలం పూర్తికావొస్తోంది. వీరిస్థానాల్లో ముగ్గురు కొత్తవారిని రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. 

సరిగ్గా రాజ్యసభ ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యేగా మారిపోవడంతో, ఈసారి ఆయన ఓటు హక్కు కోల్పోయినట్టే. ఇది ఆయనకు మింగుడుపడని పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీకి కూడా ఇది నిరాశ కలిగించే విషయం కానుంది.

More Telugu News