'అన్నపూర్ణి' వివాదంపై క్షమాపణలు చెప్పిన నయనతార.. లేఖ విడుదల

Nayanthara apologized for Annapurni Movie controversy
‘అన్నపూర్ణి’ సినిమా వివాదంపై నటి నయనతార క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. తనకు, తన సినిమా బృందానికి ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనే ఉద్దేశంలేదని వివరణ ఇచ్చారు. ‘ఓం' చిహ్నం, 'జై శ్రీరామ్' నినాదంతో కూడిన క్షమాపణ లేఖను నయనతార షేర్ చేశారు. సానుకూల సందేశాన్ని అందించేందుకు తాము చేసిన ప్రయత్నం అనుకోని రీతిలో ఇతరులకు బాధ కలిగించి ఉండవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. 

సెన్సార్ అనుమతి పొంది గతంలో థియేటర్లలో ప్రదర్శించిన సినిమాని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తారని తాము ఊహించలేదన్నారు. ఈ సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకున్నామని నయనతార అన్నారు. భగవంతుడిని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని తానని, దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను తరచుగా సందర్శించే వ్యక్తిని తానని ప్రస్తావించారు. ‘అన్నపూర్ణి’ సినిమా ద్వారా ఎవరి మనోభావాలకైనా బాధ కలిగించివుంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని నయనతార పేర్కొన్నారు. 

ఈ సినిమాలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి ‘అన్నపూర్ణి’ (నయనతార పోషించింది) ఇండియాలోనే టాప్ చెఫ్ కావాలని కలలు కంటుంది. అయితే తన లక్ష్యం, సనాతన ఆదర్శాల మధ్య ఆమె కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటుంది. అన్నపూర్ణి లక్ష్యాన్ని చేరుకోవడానికి తన క్లాస్‌మేట్ ఫర్హాన్ ( జై పోషించిన పాత్ర) సపోర్ట్ చేస్తాడు. ఈ క్రమంలో అన్నపూర్ణి మాంసాహారం తినడం మొదలుపెడుతుంది. ఒక సీన్‌లో ఫర్హాన్, అన్నపూర్ణి మాంసం తినేలా ఒప్పిస్తాడు. రాముడు కూడా మాంసాహారం తినేవాడని, మాంసాహారం తినడం పాపం కాదని ఈ సీన్‌లో చెబుతాడు. 

దీనిపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు రమేష్ సోలంకి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైలో కేసు కూడా నమోదయ్యింది. నటులు నయనతార, జై, రచయిత-దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్, పునీత్ గోయెంకాతో పాటు జీ స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షరీక్ పటేల్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధినేత మోనికా షెర్గిల్‌ పేర్లను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా గత వారమే ‘అన్నపూర్ణి’ సినిమాని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది.
Go Back to Shorts
Nayanthara
Annapoorani controversy
Annapoorani
Movies news

More Telugu News