New Virus: ప్రమాదకర వైరస్ పై చైనా ప్రయోగాలు.. ఈ వైరస్ మరణాల రేటు 100 శాతం!

  • జీఎక్స్-పీ2వీ అనే ఉపరకంపై చైనా ప్రయోగాలు 
  • ఎలుకలపై వైరస్ ను ప్రయోగించిన చైనా శాస్త్రవేత్తలు
  • 8 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎలుకలు
Chinese lab crafts mutant COVID19 strain

కరోనా వైరస్ జాతికి చెందిన ఒక ప్రమాదకర ఉపరకంపై చైనా ప్రయోగాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనానే కరోనా వైరస్ ను సృష్టించిందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో ప్రమాదకరమైన వైరస్ పై ప్రయోగాలు చేస్తోందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం అందరినీ మరోసారి భయభ్రాంతులకు గురి చేస్తోంది. 

వూహాన్ లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం... చైనా శాస్త్రవేత్తలు సార్స్-కోవ్-2కు చెందిన జీఎక్స్-పీ2వీ అనే ఉపరకంపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కొత్త వైరస్ మరణాల రేటు 100 శాతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది 2017లో వెలుగు చూసిన జీఎక్స్ ఉత్పరివర్తనం అని తెలుస్తోంది. ఈ వైరస్ ను గతంలో మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. 

జీఎక్స్-పీ2వీ వైరస్ ను తొలుత ఎలుకలపై ప్రయోగించారట. ఈ వైరస్ ఎలుకలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. కేవలం 8 రోజుల్లోనే అన్ని ఎలుకలు చనిపోయాయి. ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడుపై వైరస్ తీవ్ర ప్రభావం చూపిందట. క్రమంగా బరువు తగ్గి, రోజుల వ్యవధిలోనే నడవలేని స్థితికి వాటి ఆరోగ్యం క్షీణించింది. చనిపోవడానికి ఒక రోజు ముందు వాటి కళ్లు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. 

అయితే ఈ వైరస్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని సదరు అధ్యయనం వెల్లడించలేదు. అయితే ఎలుకల్లో కనిపించిన లక్షణాలే మనుషుల్లో కూడా కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీఎక్స్-పీ2వీ వైరస్ తో మనుషులకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెపుతున్నారు.

More Telugu News