చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై భిన్నాభిప్రాయాలు.. సీజేఐకు నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
- తీర్పులో భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన ద్విసభ్య ధర్మాసనం
- మాజీ ముఖ్యమంత్రికి 17 ఏ వర్తిస్తుందన్న జస్టిస్ అనిరుద్ద బోస్
- వర్తించదన్న జస్టిస్ బేలా ఎం. త్రివేది
- విస్తృత ధర్మాసనానికి అప్పగించాలంటూ సీజేఐకు విజ్ఞప్తి
చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సెప్టెంబర్ 9న అధికారులు అరెస్టు చేశారు. మెడికల్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చిన చంద్రబాబు.. తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందారు. అయితే, తన అరెస్టు సందర్భంగా సీఐడీ అధికారులు నిబంధనలు పాటించలేదని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.
విపక్ష నేతగా తనకు ఐపీసీ సెక్షన్ 17 ఏ కింద ప్రొటెక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబు వాదనలను హైకోర్టు తిరస్కరించింది. దీంతో చంద్రబాబు తరఫున ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బాలా ఎం త్రివేది వాదనలు విన్నారు. చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తించదంటూ ఏపీ సీఐడీ వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం గతేడాది అక్టోబరు 20న తీర్పు రిజర్వ్ చేసింది.