ప్రయాణ గమనంలో మరో విప్లవం.. ధ్వనివేగానికి మించి ప్రయాణించే విమానాన్ని ఆవిష్కరించిన నాసా.. వీడియో ఇదిగో!
- శబ్దవేగానికి 1.4 రెట్లు అధికంగా ప్రయాణించే ఎక్స్-59
- ప్రపంచంలోనే తొలి నిశ్శబ్ద సూపర్‌సోనిక్ విమానంగా ఎక్స్-59
- మొత్తం విమానం పొడవులో మూడింట ఒక వంతు సన్నని ముక్కు
- షాక్ తరంగాలను తిప్పికొట్టేందుకే
ఈ విమాన గరిష్ఠ వేగం ధ్వనికంటే 1.4 రెట్లు అధికం. అంటే గంటకు 1,488 కిలోమీటర్లు. ఈ ఏడాది చివర్లో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నిశ్శబ్ద సూపర్ సోనిక్ విమానం. సన్నగా ఉండే ఎక్స్-59 ముక్కు దాని మొత్తం పొడవులో మూడింట ఒక వంతు ఉంది. దీనివల్ల సోనిక్ బూమ్స్‌కు కారణమయ్యే షాక్ తరంగాలను తిప్పికొట్టేందుకు ఉపయోగపడుతుంది.
విమానం మొత్తం పొడవు 99.7 అడుగులు కాగా, వెడల్పు 29.5 అడుగులు. విమానం సూపర్ సోనిక్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సాధారణ విమానాల్లో ఉండే ఫార్వర్డ్-ఫేసింగ్ కిటికీలను తొలగించారు. అతి తక్కువ కాలంలోనే దీనిని అభివృద్ధి చేసి టేకాఫ్ కు సిద్ధం చేసినట్టు నాసా తెలిపింది. ఎక్స్-59తో ప్రయాణ గమనమే మారిపోతుందని పేర్కొంది.