మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం టైటిల్ ఇదే!

Chiranjeevi 156th film title revealed
  • యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి 156వ చిత్రం
  • విశ్వంభర అనే టైటిల్ ప్రకటించిన చిత్రబృందం
  • సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కనున్న చిత్రం
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం టైటిల్ ను చిత్రబృందం నేడు ప్రకటించింది. యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 

సోషియో ఫాంటసీ జానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతోంది. ఇవాళ సంక్రాంతి సందర్భంగా చిత్రబృందం టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ స్పెషల్ కాన్సెప్ట్ వీడియోను పంచుకుంది. సరిగ్గా ఏడాది తర్వాత ఇదే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. 

యువ దర్శకుడు వశిష్ఠ... నందమూరి కల్యాణ్ రామ్ తో తెరకెక్కించిన 'బింబిసార' చిత్రం హిట్టవడం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. దర్శకుడు వశిష్ఠకు కూడా మంచి గుర్తింపే లభించింది. ఆ గుర్తింపే ఆయన్ను మెగా కాంపౌండ్ వైపు నడిపించింది. 

కాగా, 'విశ్వంభర' చిత్రంలో కొత్త ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు చూఛాయగా చెప్పారు. పంచభూతాలకు త్రిశూల శక్తిని జోడించి, ఆధ్యాత్మిక కోణాన్ని జత చేసి ఒక నవ్య లోకాన్ని ఆవిష్కరించనున్నామని వశిష్ఠ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దాంతో ఈ చిత్రం సోషియో ఫాంటసీ జానర్ లో వస్తున్న విషయం స్పష్టమైంది. 

'విశ్వంభర' చిత్రంలో ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన అనుష్క, మృణాల్ ఠాకూర్ నటించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Vishwambhara
Mega156
Chiranjeevi
Vasishta
UV Creations
Title
Tollywood

More Telugu News