tsspdcl: గాలిపటాలు ఎగురవేసేవారికి విద్యుత్ శాఖ కీలక సూచన

  • మాంజా దారంతో గాలిపటం ఎగురవేయవద్దని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ సూచన
  • విద్యుత్ స్తంభాల వద్ద, సబ్ స్టేషన్ల వద్ద ఎగురవేయద్దన్న సంస్థ
  • పిల్లలు గాలి పటాలు ఎగురవేసినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని హితవు
TSSPDCL suggestion to kite flyiers

సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ శనివారం పతంగులు ఎగురవేసే వారికి కీలక సూచన చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చాలామంది పతంగులు ఎగురవేస్తారు. కొంతమంది లోహపు పూతతో కూడిన మాంజా దారంతో పతంగిని ఎగురవేస్తారు. ఈ మాంజా దారం విద్యుదాఘాతానికి, సరఫరాలో ట్రిప్పింగ్ కావడానికి అవకాశముందని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ పేర్కొంది. విద్యుత్ స్తంభాల వద్ద గాలి పటాలు ఎగురవేయవద్దని సూచించింది. ఈ మేరకు శనివారం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ ప్రకటన విడుదల చేశారు.

విద్యుదాఘాతానికి కారణమయ్యే లోహపు పూతతో కూడిన దారాలను ఉపయోగించకూడదని సూచించారు. కాటన్ లేదా నార లేదా నైలాన్ తీగలను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. మెటాలిక్ థ్రెడ్ వంటి వాటిని ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇవి విద్యుత్ లైన్‌ను తాకితే విద్యుదాఘాతానికి కారణమవుతుందని హెచ్చరించారు. విద్యుత్ తీగల వద్ద లేదా సబ్ స్టేషన్ వద్ద గాలిపటాలు ఎగురవేయవద్దన్నారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేసినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. గాలిపటం లేదా వస్తువులు విద్యుత్ లైన్లలో, విరిగిన కండక్టర్‌లో చిక్కుకుంటే వెంటనే 1912కు ఫోన్ చేయాలని లేద సమీప విద్యుత్ కార్యాలయానికి సమాచారం అందించాలని తెలిపారు.

More Telugu News