J Santha: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎంపీ జె.శాంత

  • 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున బళ్లారి ఎంపీగా గెలిచిన శాంత
  • శాంతకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్
  • వాల్మీకి సామాజిక వర్గానికి జగన్ పాలనలోనే ప్రాధాన్యత లభించిందన్న శాంత
Former MP J Santha joins YSRCP

ఏపీలో ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో... పార్టీలకు రాజీనామాలు, పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఇవాళ అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జె.శాంత వైసీపీలో చేరారు. 

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శాంతకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ విజయం కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఆమెకు సూచించారు. 

అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శాంత 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున బళ్లారి నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె వాల్మీకి సామాజికవర్గానికి చెందినవారు. ఇవాళ వైసీపీలో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓ ఇంటికి పెద్ద కొడుకులా సీఎం జగన్ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని, ఆయన చేస్తున్న మంచి పనులను దేశమంతా చూస్తోందని కొనియాడారు. 

జగన్ నాయకత్వంలో వైసీపీలో తాను ఒక సైనికురాలిగా పనిచేస్తానని చెప్పారు. వాల్మీకి కులానికి గతంలో ఏ పార్టీ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, జగన్ పాలనలో వాల్మీకి వర్గానికి ప్రాధాన్యత లభించిందని శాంత పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

More Telugu News