France: ఫ్రాన్స్‌లో చిక్కుకున్న భారతీయులు.. నేడు భారత్‌కు ప్రయాణం!

  • భారతీయ ప్రయాణికులతో ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయిన విమానం
  • మానవ అక్రమరవాణా అనుమానాలతో విమానాన్ని నిలువరించిన అధికారులు
  • ఆదివారం విచారణ అనంతరం ఫ్రాన్స్ వీడేందుకు అనుమతి
  • విమానం భారత్‌కు రావచ్చన్న స్థానిక బార్ అసోసియేషన్ 
Indians On Flight Grounded In France To Leave Today

ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయిన 303 మంది భారతీయులకు ఆటంకాలు తొలగిపోయాయి. సోమవారం వారి విమానం ఫ్రాన్స్‌ను వీడేందుకు అనుమతించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, మునుపటి షెడ్యూల్ ప్రకారం విమానం నికరాగువాకు వెళుతుందా? లేక భారత్‌కు వస్తుందా? అన్న దానిపై స్పష్టత లేదు. మానవ అక్రమరవాణా అనుమానంతో ఫ్రాన్స్ అధికారులు భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని గురువారం నిలువరించిన విషయం తెలిసిందే. దుబాయి నుంచి భారతీయులతో నికరాగువాకు వెళుతున్న లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానం ఫ్రాన్స్‌లో వాట్రీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు దిగిన సమయంలో అధికారులు దానిని నిలువరించారు.  

కాగా, ప్రయాణికులను రెండు రోజుల పాటు ఎయిర్‌పోర్టులోనే ప్రశ్నించారు. విచారణకు ఎయిర్‌పోర్టులోనే ఏర్పాట్లు చేశారు. కోర్టు సిబ్బంది, అనువాదకులు, న్యాయవాదులను అందుబాటులో ఉంచారు. ఆదివారం విచారణ జరిపి ప్రయాణానికి పూర్తి అనుమతులు జారీ చేశారు. కాగా, ప్రయాణికుల్లో 11 మంది చిన్నారులు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు తేలింది. మరో 10 మంది ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందేందుకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే,  విమానం ఎటు వెళుతుందన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఇండియాకు వచ్చే అవకాశం ఉందని స్థానిక బార్ అసోసియేషన్ మీడియాకు తెలిపింది.

More Telugu News