ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదుల మెరుపుదాడి.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికుల వీరమరణం
- జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దుశ్చర్య
- ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపడుతుండగా రెండు ఆర్మీ ట్రక్కులపై దాడి చేసిన తీవ్రవాదులు
- ఇంటెలిజెన్సీ సమాచారంతో బుధవారం రాత్రి నుంచి ఆపరేషన్ చేపడుతున్న ఆర్మీ
రాజౌరీ ప్రాంతంలో రెండేళ్లలోనే 35 మంది సైనికుల కన్నుమూత
జమ్మూకశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారింది. 2003 నుంచి 2021 వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో గత రెండేళ్ల వ్యవధిలో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. అందుకే ఈ ప్రాంతంలో సైన్యం పెద్దఎత్తున ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు చేపడుతోంది. అయితే ఈ ఆపరేషన్లలో పాల్గొంటున్న సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 35 మంది కన్నుమూశారని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. రాజౌరీలోని కలాకోట్లో గత నెలలో చేపట్టిన యాంటి టెర్రరిస్ట్ ఆపరేషన్లో ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన జంట దాడుల్లో 10 మంది సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.