alleti maheshwar reddy: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పగా మారింది: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

  • రైతులకు కేంద్రం రూ.25 వేలకు పైగా ఇస్తోందన్న మహేశ్వర్ రెడ్డి
  • న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన నిధులు కేంద్రం ఇచ్చిందని స్పష్టీకరణ
  • మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీశ్ రావు అబద్దాలు చెప్పారని మండిపాటు
BJP MLA Maheswar Reddy lashes out at BRS government

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే అమలు కానీ హామీలను ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఏలేటి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నీ కలిపి ఏడాదికి రూ.25వేలకు పైగా ఇస్తోందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణలో 39 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించారు. న్యాయపరంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కంటే ఎక్కువగానే తెలంగాణకు వచ్చాయని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని మాజీ మంత్రి హరీశ్ రావు అవాస్తవాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అబద్దాలతో హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందన్న దానికి హరీశ్ రావు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. మీటర్లు తప్పనిసరిగా పెట్టాలని కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. కేంద్రం తెలంగాణకు లక్షల కోట్లు ఇస్తున్నా... గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. వచ్చే ఆదాయంలో 30 శాతం మాత్రమే ప్రజలకు చేరువవుతోందన్నారు.

ముప్పై శాతం నిధులతో అమలు కానీ హామీలు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలు ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల సమయం ఇస్తామని, హామీలు అమలు కాకపోతే ప్రజాపోరాటం చేస్తామన్నారు.

More Telugu News