దొంగతనం చేసి చెరువు మధ్యలో కూర్చున్న దొంగ కోసం... చీకటైనా పోలీసుల పడిగాపులు!

హైదరాబాద్‌ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దూకి, మధ్యలో కూర్చుండిపోయాడు. అతని కోసం పోలీసులు రాత్రి వరకు వేచి చూస్తూనే ఉన్నారు. అతనిని చెరువు మధ్యలో నుంచి బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. శుక్రవారం సాయంత్రం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి జొరబడి దొంగతనం చేశాడు. అతను బయటకు వెళ్లేలోపు ఇంటి యజమాని వచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంతదూరంలోని చెరువులో దూకాడు.

ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతనిని బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా బయటకు రాలేదు. చీకటి పడటంతో పోలీసులు దొంగను ఎలా పట్టుకోవాలా? అని ఆలోచిస్తున్నారు. చెరువులోకి దూకిన దొంగ కళ్ళ ముందే కనిపిస్తున్నప్పటికీ ఎలా పట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.


More Telugu News