Jagan: జగన్ ఆస్తుల కేసులపై పిల్... తెలంగాణ హైకోర్టులో విచారణ

Telangana high court takes up hearing on Jagan assets cases petition
  • జగన్ ఆస్తుల కేసులపై హరిరామజోగయ్య పిల్
  • ఎన్నికల్లోపు విచారణ పూర్తి చేయాలని కోర్టుకు విజ్ఞప్తి
  • 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడి
  • డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో మెన్షన్ చేశామన్న సీబీఐ న్యాయవాది
  • రెండు నెలల్లో డిశ్చార్జి పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇదివరకు వైఎస్ జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అయితే, ప్రతివాదులకు ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తోంది. 

కాగా, ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్ ను, జగన్ కేసులపై దాఖలైన పిల్ తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. 

జగన్ పై నమోదైన కేసుల విచారణను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని హరిరామజోగయ్య తన పిటిషన్ లో కోరారు. ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ, డిశ్చార్జి పిటిషన్ల పెండింగ్ పై సీబీఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న పిమ్మట తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి పిటిషన్లపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.
Jagan
Assets Cases
Harirama Jogaiah
Telangana High Court

More Telugu News