IMD Forecast: ఢిల్లీలో గడ్డకట్టుకుపోతున్న ప్రజలు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన

  • ఢిల్లీలో ఈ ఉదయం 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • 500 మీటర్ల లోపే కంటిచూపు
  • మంచుకౌగిలిలో ఢిల్లీ, పంజాబ్
  • అరేబియా సముద్రంలో వాయుగుండం
Delhi records below 5 degrees heavy rain likely in Tamil Nadu

ఢిల్లీ ప్రజలు చలితో గడ్డకట్టుకుపోతున్నారు. ఈ ఉదయం అక్కడ అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని ఇతర ప్రాంతాలైన లోధిరోడ్‌లో 5, అయానగర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, అత్యంత కనిష్ఠంగా హర్యానాలోని హిసార్‌లో 4.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు పంజాబ్‌ కూడా దట్టమైన మంచులో చిక్కుకుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, మేఘాలయ, త్రిపురలో ఈ ఉదయం పొగమంచు కమ్ముకుంది. 

ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో 500 మీటర్లకు మించి ఏమీ కనపడడం లేదు. శుక్రవారం వాతావరణంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని భారత వాతావరణశాఖ నిన్ననే ఊహించి హెచ్చరికలు జారీ చేసింది. ఈ వారం మొత్తం వాతావరణం ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు, వచ్చే వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో ఢిల్లీని పొగమంచు కప్పేస్తుందని తెలిపింది. నిన్న కూడా ఢిల్లీలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దారుణంగా పడిపోయింది.  

నైరుతి అరేబియా సముద్రంలో వాయుగుండం
నైరుతి అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలోనూ తుపాను లేదంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ భారతదేశం, తమిళనాడులో నేటి నుంచి వచ్చే మూడు రోజులపాటు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 17న కేరళ, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

More Telugu News