Flight: పాస్ పోర్ట్, వీసా, టికెట్ లేవు.. అయినా విమానంలో అమెరికా చేరిన రష్యన్!

  • ఇజ్రాయెల్ లో స్థిరపడిన రష్యన్ వ్లాదిమిరోవిచ్ 
  • డెన్మార్క్ నుంచి లాస్ఏంజిలిస్ వరకు జర్నీ
  • ఎయిర్ పోర్ట్ లో అతడిని గుర్తించిన కస్టమ్స్ సిబ్బంది షాక్
  • విమానంలో ఎలా ఎక్కానో కూడా గుర్తులేదంటున్న రష్యన్
Russian man reaches US without ticket boarding pass passport or visa

దేశవిదేశాలకు రాకపోకలు సాగించే విమానాశ్రయంలో సెక్యూరిటీ చాలా పటిష్ఠంగా ఉంటుంది. ప్రయాణానికి సంబంధించిన టికెట్ చూపిస్తే కానీ లోపలికి అడుగుపెట్టడం కుదరదు. ఇక దేశం దాటి వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా.. ఇలా చాలా తతంగం ఉంటుంది. అలాంటిది రష్యన్ పౌరుడు ఒకరు టికెట్ కూడా లేకుండా విమానం ఎక్కాడు. పాస్ పోర్టు, వీసా లేకున్నా ఏకంగా దేశం దాటాడు. విమానం ల్యాండయ్యాక విమానాశ్రయం సిబ్బంది ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు వచ్చిన విమానాలకు సంబంధించి ప్రయాణికుల లిస్ట్ ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసినా ఆయన పేరు లేకపోవడమే వారి ఆశ్చర్యానికి కారణం. అసలు ఎలా ప్రయాణించావని ఆయననే అడిగితే.. తనకేం గుర్తులేదని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. కిందటి నెలలో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

రష్యాకు చెందిన సెర్గెయ్ వ్లాదిమిరోవిచ్ ఒచిగవా ఇజ్రాయెల్ లో స్థిరపడ్డారు. నవంబర్ 4న ఆయన డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాలోని లాస్ఏంజిలిస్ కు ప్రయాణించారు. అయితే, ఈ ప్రయాణానికి సంబంధించి ఆయన ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకోలేదు. పాస్ పోర్ట్ వెంట తీసుకెళ్లలేదు, టికెట్ కొనలేదు, వీసా కూడా లేదు.. అంతెందుకు విమానంలోకి ఎంటర్ కావడానికి తప్పనిసరి అయిన బోర్డింగ్ పాస్ కూడా ఒచిగవా దగ్గర లేదు. అయినా విమానం ఎక్కి దేశాలు దాటి ప్రయాణించాడు.

ఏ డాక్యుమెంట్లు లేకుండా విమానం దిగిన ఒచిగవాను చూసి లాస్ఏంజిలిస్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇతర విమానాలలో వచ్చాడేమోనని మిగతా ప్రయాణికుల వివరాలను పరిశీలించారు. ఆ రోజు వచ్చిన విమానాలే కాదు అంతకుముందు రెండు మూడు రోజుల ప్రయాణికుల జాబితాలోనూ ఒచిగవా పేరులేదు. దీంతో ఇదెలా సాధ్యమైందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒచిగవాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మూడు రోజులుగా తనకు నిద్రలేదని, అసలు విమానం ఎలా ఎక్కానో కూడా తనకు గుర్తులేదని చెప్పాడు. ప్రయాణం మధ్యలో ఒచిగవా పలుమార్లు సీట్లు మారాడని, భోజనం కోసం ఒకటికి రెండుసార్లు రిక్వెస్ట్ చేశాడని ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పారు. ఒచిగవా కాస్త అశాంతిగా కనిపించాడని విచారణలో వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై అమెరికా నేర పరిశోధనా సంస్థ ఎఫ్ బీఐ ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

More Telugu News