Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ కు భారత జట్టు ఎంపిక... ఇద్దరు హైదరాబాదీలకు చోటు

  • దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్ కప్
  • 15 మందితో భారత యువ జట్టు ప్రకటన
  • హైదరాబాద్ కు చెందిన అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ లకు స్థానం
  • వరల్డ్ కప్ కు ముందు ముక్కోణపు సిరీస్ ఆడనున్న కుర్రాళ్లు
BCCI announces India squad for Under 19 World Cup

దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ కు భారత కుర్రాళ్ల జట్టును నేడు ఎంపిక చేశారు. వరల్డ్ కప్ కంటే ముందు డిసెంబరు 29 నుంచి జరిగే ముక్కోణపు సిరీస్ లోనూ ఈ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. 

డిసెంబరు 29 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే ఈ ట్రయాంగులర్ సిరీస్ లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో పాటు టీమిండియా, ఇంగ్లండ్ యువ జట్లు ఆడనున్నాయి. ఈ ముక్కోణపు టోర్నీ జనవరి 10తో ముగియనుంది. అనంతరం, జనవరి 19 నుంచి అండర్-19 వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. 

కాగా, యువ భారత జట్టులో ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు స్థానం లభించింది. ఆరవెల్లి అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యారు. అవనీశ్ రావు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కాగా, మురుగన్ అభిషేక్ బౌలర్. వీళ్లిద్దరూ ప్రస్తుతం అండర్-19 కప్ లో ఆడుతున్న భారత యువ జట్టులో సభ్యులు. దాదాపు ఆసియా కప్ లో ఆడుతున్న భారత యువ జట్టునే వరల్డ్ కప్ కు కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.


ముక్కోణపు సిరీస్, అండర్-19 వరల్డ్ కప్ లకు భారత కుర్రాళ్ల జట్టు ఇదే...
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ఆరవెల్లి అవనీశ్ రావు  (వికెట్ కీపర్),  మురుగన్ అభిషేక్, ఇన్నేశ్ మహాజన్ (వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ. 

జట్టుతో పాటు ఉండే స్టాండ్ బై ఆటగాళ్లు (ముక్కోణపు సిరీస్ కు మాత్రమే)
ప్రేమ్ దేవ్ కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్

బ్యాకప్ ప్లేయర్లు...
దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేశ్, కిరణ్ చార్మోలే

కాగా, అండర్-19 వరల్డ్ కప్ లో భారత యువ జట్టు తన ప్రస్థానాన్ని జనవరి 20న ప్రారంభించనుంది. టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది. ఈ వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు 'ఏ' గ్రూపులో ఉంది. ఈ గ్రూపులో భారత్ తో పాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా జట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తున్న అండర్-19 వరల్డ్ కప్ 2024 జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది.

More Telugu News