Gold Theft: శ్రీకాకుళం స్టేట్ బ్యాంకులో గోల్డ్ చోరీ మిస్టరీ వీడింది

  • తాకట్టు పెట్టిన 7 కేజీల బంగారు నగలు మాయం
  • ఇంటి దొంగల పనేనని తేల్చిన పోలీసులు
  • డిప్యూటీ మేనేజర్ స్వప్న ప్రియ ఆత్మహత్య
  • పరారీలో మరో నిందితుడు.. గాలిస్తున్న పోలీసులు
Srikakulam Gold Theft Mystery solved says police

శ్రీకాకుళం జిల్లా గార స్టేట్ బ్యాంక్ లో బంగారం చోరీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారం సంచులను ఇంటి దొంగలే కాజేశారని తేల్చేశారు. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు డిప్యూటీ మేనేజర్ స్వప్న ప్రియ చోరీ చేసిందని గుర్తించారు. స్వప్న ప్రియతో పాటు మొత్తం 9 మందిని నిందితులుగా ప్రకటించారు. అయితే, ఈ కేసు బయటపడడంతో స్వప్న ప్రియ కిందటి నెలలో ఆత్మహత్యకు పాల్పడింది. మిగతా నిందితుల్లో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు, బ్యాంక్ ఉద్యోగి సురేశ్ పరారీలో ఉన్నాడని చెప్పారు. సురేశ్ కోసం గాలిస్తున్నామని వివరించారు. ఈ కేసులో చోరీకి గురైన బంగారంలో 7 కిలోల 146 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. దీని విలువ మార్కెట్లో రూ.7 కోట్లు ఉంటుందని వివరించారు. మరో 24.5 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. రికవరీ చేసిన ఆభరణాలను కోర్టు ద్వారా కస్టమర్లకు అందజేస్తామని వివరించారు.

ఏం జరిగిందంటే..
గార స్టేట్ బ్యాంక్ లో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. సుమారు 60 బ్యాగులలోని 7 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇది ఇంటిదొంగల పనేనని, బ్యాంకు సిబ్బందిలోనే ఎవరో చేతివాటం ప్రదర్శించారని పోలీసులు మొదటి నుంచీ అనుమానిస్తూనే ఉన్నారు. చివరకు అదే నిజమని విచారణలో బయటపడింది. బ్యాంకు డిప్యూటీ మేనేజర్ స్వప్న ప్రియ ఈ కేసులో ప్రధాన నిందితురాలని, ఆమెకు లోహిత కన్సల్టెన్సీకి చెందిన తిరుమల రావు సహకరించాడని గుర్తించారు. దాదాపు ఏడాదిగా ఈ వ్యవహారం సాగుతోందని పోలీసులు చెప్పారు. నగల చోరీ కేసులో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆందోళనకు గురైన స్వప్న ప్రియ గత నెల 29న ఆత్మహత్యకు పాల్పడింది. 

చోరీ చేసి ఏం చేసేవారంటే..
బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను కొద్దికొద్దిగా స్వప్న ప్రియ కాజేసేది. వాటిని తిరుమల రావు ద్వారా సీఎస్ బి, ఫెడరల్ బ్యాంకులలో బినామీ పేర్లతో తాకట్టు పెట్టేది. ఇలా తీసుకున్న రుణాన్ని తన సోదరుడు కిరణ్ తో కలిసి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టింది. ఈ చోరీకి స్వప్న ప్రియ బ్యాంకు ఉద్యోగి సురేశ్ సాయం తీసుకుంది. బ్యాంకు లాకర్ల కీ ఒకటి స్వప్న ప్రియ వద్ద, రెండోది సురేశ్ వద్ద ఉంటుంది. దీంతో ఇద్దరూ కలిసి ఆభరణాలను కాజేశారు. విషయం బయటపడడంతో ఉన్నతాధికారులు ప్రశ్నించగా.. చోరీకి గురైన 86 బ్యాగులలో 26 బ్యాగులను స్వప్న ప్రియ తిరిగిచ్చేసింది. మిగతా వాటి కోసం ప్రశ్నించడంతో ఆందోళన చెందిన స్వప్న ప్రియ.. ఆత్మహత్యకు పాల్పడింది.

More Telugu News