Ravichandran Ashwin: మిగ్జామ్ తుపాను ఎఫెక్ట్‌పై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్

  • 30 గంటలు గడిచినా విద్యుత్ లేదని ‘ఎక్స్’లో షేర్ చేసిన అశ్విన్
  • దాదాపు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని వెల్లడి
  • మిగ్జామ్ తుపాను ఎఫెక్ట్‌పై స్పందించిన టీమిండియా క్రికెటర్
Ravichandran Ashwin reacts on the effect of Cyclone Mijam

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మిగ్జామ్ తుపాను బీభత్సం సృష్టించింది. తీరం దాటే సమయంలో, అంతకుముందు తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో తీర ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. మరీ ముఖ్యంగా తీవ్ర వర్షాల ధాటికి చెన్నై నగరం అతలాకుతలమైంది. అక్కడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి కూడా తుపాను ఇక్కట్లు తప్పలేదు. 

తాను నివసిస్తున్న ప్రాంతంలో కరెంట్ లేదని అశ్విన్ వెల్లడించారు. దాదాపు 30 గంటలు గడుస్తున్నా విద్యుత్ లేదని వాపోయాడు. చాలా ప్రాంతాల్లో దాదాపు ఇదే సమస్య ఉందని అంటున్నారని చెప్పాడు. ఏం చేయాలో తోచడం లేదంటూ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు మరో ట్వీట్‌లో ‘వర్షం ఆగిపోయినా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది’ అని ట్వీట్ చేశాడు. మిగ్జామ్ తుపాను ఎఫెక్ట్‌ను అశ్విన్ ట్వీట్లు  తెలియజేస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.   

ఇదిలావుంచితే.. చెన్నైలోని చాలా ప్రాంతాలు కరెంట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా తమ ఇబ్బందులను స్థానికులు తెలియజేస్తున్నారు. వర్షం తగ్గిపోయినప్పటికీ వరదలు, కరెంట్ సమస్యలు అక్కడివారిని ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. మిగ్జామ్ తుపాను ప్రభావం ధాటికి తమిళనాడులో 12 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అక్కడి రోడ్లు నదులుగా మారిపోయాయి. వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు తీవ్రమైన వర్షాల ప్రభావంతో విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయవచ్చునని ప్రైవేట్ కంపెనీలు తెలిపాయి. కాగా మిగ్జామ్ మంగళవారం మధ్యాహ్నం  12.30 నుంచి 2.30 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల వద్ద తీరం దాటింది.

More Telugu News