Why AP Needs Jagan: 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమంపై పిటిషన్.. సజ్జల, సీఎస్ సహా పలువురికి హైకోర్టు నోటీసులు

  • రాజకీయ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ పిటిషన్
  • అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణ
  • జగన్ ను కీర్తించడానికి కోట్లు ఖర్చు చేస్తున్నారన్న పిటిషనర్
AP HC issues notices to Sajjala and others in petetion against Why AP needs Jagan programme

'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ఉమేశ్ చంద్ర పిటిషన్ వేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని పిటిషన్ లో కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచలన మేరకు ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆరోపించారు. సజ్జలతో పాటు చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. 

ఈ కార్యక్రమంలో వైసీపీతో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పని చేయాలని మీడియా సమావేశంలో సజ్జల బహిరంగంగా చెప్పారని పిటిషన్ లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని... అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ను కీర్తించడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. సజ్జల, చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

More Telugu News