ఆస్తిలో 99 శాతానికి పైగా దానం చేస్తూ అపరకుబేరుడు వారెన్ బఫెట్ వీలునామా!
- మరణానంతరం తన ఆస్తిలో 99 శాతానికి పైగా కుటుంబ నిర్వహణలోని ట్రస్టులకు బదిలీ చేస్తూ విల్లు
- విల్లు అమలుపరిచే బాధ్యతను తన ముగ్గురు కుమారులకు అప్పగింత
- వారసత్వ సంపద ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య
- పెట్టుబడిదారీ వ్యవస్థలో లోపాలున్నా ఎన్నో అద్భుతాలు సాధించిందని వెల్లడి
పారంపర్య ఆస్తులన్నవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నవే అయినా ఇది మంచిది కాదని తనతో పాటూ తన కుమారుల విశ్వాసమని వారెన్ బఫెట్ తెలిపారు. మనిషిని సంపద దుష్టుడిగా లేదా ఉన్నతుడిగా మార్చదని కూడా వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ అది ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించిందన్నారు. తన ముగ్గురు కుమారులు ట్రస్టు వ్యవహారాలు చూస్తారని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు కాబట్టి, ఆస్తికి వారసులను ప్రకటించడం వివేకమైన చర్యగా పేర్కొన్నారు.
వారెన్ బఫెట్ స్థాపించిన బర్క్‌షైర్ హాథ్‌వే ప్రస్తుత మార్కెట్ విలువ 780 బిలియన్ డాలర్లు. సంస్థలో మొత్తం 3.8 లక్షల మంది పనిచేస్తున్నారు. బఫెట్ అనంతరం కూడా సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సంస్థ సీఈఓ విశ్వాసం వ్యక్తం చేశారు.