T20 World Cup: వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్... ఇప్పటివరకు క్వాలిఫై అయిన జట్లు ఇవే!

  • టీ20 వరల్ కప్ కు ఇప్పటిదాకా 19 జట్లు క్వాలిఫై
  • నేరుగా క్వాలిఫై అయిన 8 జట్లు
  • ర్యాంకింగ్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు చోటు
  • సాధించిన విజయాల ఆధారంగా నెదర్లాండ్స్ ఆటోమేటిక్ క్వాలిఫై
  • ఆతిథ్య జట్ల హోదాలో వెస్టిండీస్, అమెరికా జట్లకు అవకాశం
Teams qualified for T20 World Cup so far

వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్నాయి. కాగా, ఈ టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు అర్హత పొందాయి. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. 

బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు బెర్తులు దక్కించుకున్నాయి. ఆతిథ్య జట్ల హోదాలో వెస్టిండీస్, అమెరికా జట్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నాయి. సాధించిన విజయాల ఆధారంగా నెదర్లాండ్స్ కూడా ఆటోమేటిగ్గా క్వాలిఫై అయింది. 

ఇక ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా జట్లు క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గి టీ20 వరల్డ్ కప్-2024కి అర్హత సాధించాయి. రేపు క్వాలిఫయింగ్ టోర్నీలో ఉగాండా, కెన్యా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో ఉగాండా విజయం సాధిస్తే ఆ జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ లో అడుగుపెట్టనుంది. మరోవైపు జింబాబ్వే జట్టుకు కూడా స్వల్ప అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 20 జట్లతో టీ20 వరల్డ్ కప్-2024 టోర్నీ నిర్వహిస్తుండడం విశేషం. 


ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్-2024కు అర్హత పొందిన జట్లు...

టీమిండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, అమెరికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా.

More Telugu News