అమెరికాపై ఉపగ్రహ నిఘా పెట్టిన కిమ్
- కిందటి వారం అంతరిక్షంలోకి నార్త్ కొరియా స్పై శాటిలైట్
- వైట్ హౌస్, పెంటగాన్ ఫొటోలు తీసిందని వెల్లడి
- ఉపగ్రహం, అది తీసిన ఫొటోలపై కొరవడిన స్పష్టత
కిందటి వారం నార్త్ కొరియా ఓ నిఘా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది. ఈ శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరిందని, ఇప్పటికే తన పని మొదలు పెట్టిందని కిమ్ సోమవారం వెల్లడించారు. ఈ ఉపగ్రహంతో నార్త్ కొరియా శత్రువులపై నిరంతరం నిఘా పెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహ పనితీరును పరిశీలిస్తున్నామని, డిసెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో నిఘా పెడతామని చెప్పారు.
అయితే, నార్త్ కొరియా పంపించిన ఉపగ్రహం గురించి కానీ, దాని పనీతీరు గురించి కానీ బయటి ప్రపంచానికి ఎలాంటి వివరాలు తెలియవు. వాటితో పాటు ప్రస్తుతం ఆ శాటిలైట్ తీసినట్లు చెబుతున్న ఫొటోల వివరాలపైనా ప్రపంచ దేశాలకు ఎలాంటి స్పష్టత లేదు. శాటిలైట్ వివరాలు కానీ, అది తీసిన ఫొటోలు కానీ నార్త్ కొరియా ఇప్పటి వరకు బయటపెట్టలేదు.