Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి మంత్రి పదవి వదులుకున్నారు: రేవంత్ రెడ్డి

  • తెలంగాణ ఉద్యమం సమయంలో కోమటిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి
  • పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీ గేటు తాకనీయవద్దని విజ్ఞప్తి
  • కేసీఆర్ ఎలక్షన్లు.. కలెక్షన్ల కోసమే ఉద్యమం సమయంలో రాజీనామా చేశారని ఆరోపణ
Revanth Reddy praises Komatireddy Venkat Reddy

తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వదులుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నకిరేకల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీ గేటు తాకనీయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండ... రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులే అన్నారు. సమైక్య రాష్ట్రంలో నాటి తెలంగాణ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

తెలంగాణ కోసం పదవిని పూచికపుల్లలా విసిరేసినా అని కేసీఆర్ పదేపదే చెబుతారని, కానీ ఆ సన్నాసులు రాజీనామా పేరుతో ఎలక్షన్లు, కలెక్షన్ల పేరుతో ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మంత్రి పదవిని వదులుకొని... తెలంగాణ వచ్చే వరకు దానిని తీసుకోనని చెప్పారన్నారు. కార్యకర్తలు జెండా మోసి, కోమటిరెడ్డి సోదరులు కష్టపడి నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే నమ్ముకున్న వారిని నట్టేట ముంచి పార్టీ ఫిరాయించారన్నారు. దొరగారి గేటు వద్ద కాపలా కుక్కలా మారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఆరోపించారు.

More Telugu News