Ganta Srinivasa Rao: ఇది కూడా మీ మేనిఫెస్టోలో రాలిపోయే రత్నంగానే మిగిలిపోతుందా?: గంటా శ్రీనివాసరావు

  • అదిగో డీఎస్సీ, ఇదిగో డీఎస్సీ అని గొప్పలు చెప్పుకుంటున్నారన్న గంటా
  • అసలు మీకు డీఎస్సీ ఇచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్న
  • నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన ఘనత చంద్రబాబుదేనని వ్యాఖ్య
Ganta Srinivasa Rao fires on Jagan

మన రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్‌.. ‘మళ్లీ మళ్లీ పెళ్లి’ డైలాగును తలపిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. అదిగో డీఎస్సీ...ఇదిగో డీఎస్సీ... అంటూ విద్యాశాఖ మంత్రిగారు మీడియా ముందు గొప్పలు చెపుతారని... ఆ తర్వాత ఆ ఊసే ఉండదని విమర్శించారు. మొన్నటికి మొన్న వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ అన్నారని... ఆ వారాలన్నీ దాటిపోయి నెలలు గడుస్తున్నాయని విమర్శించారు. మెగా డీఎస్సీని మినీ డీఎస్సీ చేశారని... ఇప్పుడు దీనికి కూడా మోక్షం కలిగేలా లేదని అన్నారు. మంత్రి బొత్స మాటలు ఒట్టి విస్తరాకు మంచినీళ్లేనని చెప్పారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి నోటిఫికేషన్ల గారడీతో నిరుద్యోగులను మరోసారి మోసం చేయడానికి తెరతీశారని చెప్పారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారని... తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అన్నారని... ఆ తర్వాత ఏడాదికి ఒక డీఎస్సీ అన్నారని... గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారని... అసలు మీకు డీఎస్సీ ఇచ్చే ఆలోచన ఉందా? అని ప్రశ్నించారు. ఇది కూడా మీ మేనిఫెస్టోలో రాలిపోయే రత్నం గానే మిగిలిపోతుందా? అని ఎద్దేవా చేశారు. 

ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ కొందరు నిరుద్యోగులు వయసు రీత్యా అనర్హులవుతున్నారనే సంగతిని గాలికొదిలేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగం కోసం వేలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా... మీలో చలనం లేదు, నిరుద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు జగన్ గారూ అని అన్నారు. 

2014లో 9,061 పోస్టులతో... 2018లో 7,729  పోస్టులతో మెగా డీఎస్సీలు ప్రకటించి వేలాది మంది నిరుద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని... రాష్ట్రంలోని నిరుద్యోగులు ముఖ్యంగా డీఎస్సీ అభ్యర్థులు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. 2024లో రానున్నది చంద్రన్న పాలనేనని... రాష్ట్రంలో అన్నీ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసి మళ్ళీ మీ కుటుంబాలలో వెలుగులు నింపేది కూడా చంద్రన్న ప్రభుత్వమేనని అన్నారు.

More Telugu News