Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు.. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ

  • స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ
  • తొలి 3 మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న రుతురాజ్ గైక్వాడ్
  • వరల్డ్ కప్‌ 2023లో ఆడిన ముగ్గురికే చోటు.. మిగతా వారికి విశ్రాంతి
  • సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచెయ్యి
Captaincy reins to Suryakumar Yadav BCCI announces team for T20 series against Australia

నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా మొదలుకానున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5 టీ20ల సిరీస్‌కు బీసీసీఐ జట్టుని ప్రకటించింది. ఈ సిరీస్‌కు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొన్న కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో సూర్యకు ఈ అవకాశం దక్కింది. ఇక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రపంచ కప్ 2023 జట్టులో స్థానం దక్కిన ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే టీ20 జట్టులో చోటుదక్కింది. సూర్యకుమార్ యాదవ్‌తోపాటు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్‌లను మాత్రమే సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే చివరి 2 మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్ జట్టులో చేరనున్నాడని, వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని బీసీసీఐ తెలిపింది.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా జట్టులో చేరతాడు.

కాగా చీలమండ గాయం నుంచి హార్ధిక్ పాండ్యా ఇంకా కోలుకోలేదు. దీంతో టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యాను జట్లు ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదు. ఇక సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. జట్టులో అతడికి చోటు దక్కలేదు. 2024లో టీ20 వరల్డ్ కప్‌ దృష్ట్యా ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐ సెలక్టర్లు దృష్టిపెట్టారు. అందుకే ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి కొత్త ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించనున్నారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే అర్ష్ దీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్ జట్టులో కీలకపాత్ర పోషించనున్నారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే ఆల్ రౌండర్లు కాగా జితేష్ శర్మ బ్యాక్ అప్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగనున్నాడు.

More Telugu News