Revanth Reddy: కామారెడ్డికి వచ్చిన అనకొండను వేటాడేందుకే నన్ను కామారెడ్డికి పంపించారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy campaign in Kamareddy
షార్ట్స్‌లో చూడండి
ఈ అసెంబ్లీ ఎన్నికలు కామారెడ్డి భవిష్యత్తును మార్చేవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన బిక్కనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని, కనీసం కార్మికుల సంక్షేమ నిధి హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదన్నారు. 

రైతుల భూములను మింగడానికే కేసీఆర్ కామారెడ్డికి వచ్చారన్నారు. ఇక్కడ ఓటుకు రూ.10వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నారన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ అమ్మమ్మ ఊరే ఉంటే రైతులు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ గజ్వేల్‌లో భూములను ఊడ్చేశారని, ఊళ్ళకు ఊళ్లలో వేలాది ఎకరాలు బంధువులు కబ్జా పెట్టేశారన్నారు. గజ్వేల్‌లో ఏమీ మిగలలేదన్నారు. సిద్దిపేటలో అల్లుడు హరీశ్ రావు, కొడుకు కేటీఆర్ సిరిసిల్లను ఊడ్చేశారని ఆరోపించారు. అందుకే పచ్చగా కనిపించిన కామారెడ్డిపై ఇప్పుడు కన్నేశాడన్నారు.

ముదిరాజ్ బిడ్డలకు రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా కేసీఆర్ ఇవ్వలేదన్నారు. ముదిరాజ్‌లకు సీట్లు ఇవ్వవు కానీ... ఓట్లు కావాలా? అన్నారు. కేసీఆర్ ఇక్కడకు వచ్చాడంటే... ఇక్కడ మీ భూములు కబ్జా చేసి, మిమ్మల్ని ముంచుతారన్నారు. నలభై ఏళ్లుగా షబ్బీర్ అలీని ఈ నియోజకవర్గం ప్రజలు ఈ స్థాయికి తీసుకువచ్చారని, అలాంటి ప్రజల భూములను కేసీఆర్ లాక్కోవడానికి వస్తున్నాడని తెలిసి ఆయన ఆందోళన చెందాడని చెప్పారు. అలాంటి సమయంలో కామారెడ్డి భూములను లాక్కోవడానికి వచ్చిన అనకొండను... అడవి నుంచి పల్లెలోకి వచ్చిన పులిని వేటాడేందుకు... బయటి నుంచి వేటగాడిని పిలిపించినట్లుగా తనను అధిష్ఠానం కామారెడ్డికి పిలిచిందన్నారు. కామారెడ్డికి వెళ్లి అక్కడ కబ్జా చేసేందకు వచ్చిన అనకొండను వేటాడాలని తనకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అందుకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు.

తాను కామారెడ్డిలో నామినేషన్ వేయడాన్ని చూసిన కేసీఆర్, కేటీఆర్ జీర్ణించుకోలేకపోయారన్నారు. అందుకే కేసీఆర్‌కు పిచ్చిలేసి జనగామలోని చేర్యాల సభలో తనను ఓ పిచ్చికుక్క అని తనపై ఇష్టారీతిన మాట్లాడారని చెప్పారు. కానీ దళితుడిని సీఎంగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, ఇప్పుడేమో కేటీఆర్‌ను సీఎంగా చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను పిచ్చికుక్క, కేసీఆర్‌ను వీధికుక్క అని నిప్పులు చెరిగారు. ఈ పిచ్చికుక్కను, వీధికుక్కను తన్ని తరిమేయాలంటే అందరూ ఏకం కావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ కాదని, రైతుభరోసా కింద ప్రతి ఎకరానికి రూ.15వేలు ఇస్తామన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Kamareddy District
Telangana Assembly Election

More Telugu News