Revanth Reddy: కేసీఆర్ సీఎం అయ్యాక.. రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలు ఇంట్లో నుంచి రాని పరిస్థితి: రేవంత్ రెడ్డి

  • రాజయ్య, కడియం శ్రీహరి గురించి మనం చెప్పాల్సిన పని లేదు.. వారే ఒకరికొకరు చెప్పుకున్నారన్న రేవంత్ రెడ్డి
  • వారు మంత్రులుగా పని చేసి ఘనపూర్‌కు కనీసం డిగ్రీ కాలేజీ, వంద పడకల ఆసుపత్రిని తీసుకు రాలేదని విమర్శ
  • ఎర్రబెల్లి దయాకరరావుపై తీవ్రవ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy in Station Ghanpur public meeting

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, రాజయ్య వంటి వారు ఎమ్మెల్యేలు అయ్యాక అడబిడ్డలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ తీసుకువచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే రాజయ్య లేదా బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. వీరిద్దరి గురించి మనం పెద్దగా చెప్పవలసిన పని లేదన్నారు. శ్రీహరి గురించి రాజయ్య, రాజయ్య గురించి శ్రీహరి చెప్పారన్నారు. అయితే వీళ్లిద్దరికీ ఓ సారూప్యత ఉందని, వీరిద్దరూ ఉపముఖ్యమంత్రులుగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారన్నారు. వీరి గురించి కేసీఆర్‌కు తెలుసు కాబట్టే ఉద్యోగం ఊడగొట్టారన్నారు. ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా? అన్నారు.

కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా పని చేసి ఇక్కడకు డిగ్రీ కాలేజీ తీసుకు రాలేదని, రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారని, కానీ వంద పడకల ఆసుపత్రి తీసుకు రాలేదన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరను గెలిపిస్తే స్టేషన్ ఘనపూర్‌కు వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ ఇప్పిస్తానని, ఇందుకు తనది గ్యారంటీ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, రాజయ్య, కడియం శ్రీహరి ఈ రోజు పిచ్చికుక్కల్లా సందుసందుకు తీరుగుతున్నారన్నారు. ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అన్నారు. కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి, మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు.

యువకులు ఉద్యోగాలు రావాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటే ఉద్యోగాలు రాని యువత అడవిబాట పట్టే అవకాశముందని హెచ్చరించారు. కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని, ఇక కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షలు అందిస్తామన్నారు. కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామన్నారు. ఈ రోజు కేసీఆర్ పాలనలో బడికి పోవాల్సిన పన్నెండేళ్ల బాలుడు ఓ చేతిలో బీరు సీసా, మరో చేతిలో బీఆర్ఎస్ జెండా పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మద్యం షాపులు, బెల్ట్ షాపులు పెరిగాయని, దీంతో ప్రజా సంపదను దోచుకుంటున్నారన్నారు. ఇదీ ఈ రోజు రాష్ట్రంలోని పరిస్థితి అన్నారు.

ఇక్కడ దద్దమ్మ దయాకరరావు ఉన్నాడని విమర్శించారు. ఊసరవెల్లి దయాకర రావు, దద్దమ్మ దయాకరరావు, దగుల్బాజీ దయాకరరావు, మిత్రద్రోహి దయాకరరావు, పార్టీలు ఫిరాయించే దయాకరరావు, వెన్నుపోటు దయాకరరావు అంటూ ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు అడిగితే మతి ఉన్న ఏ మంత్రి అయినా ఖాళీ సీసాలు అమ్ముకోవాలని చెబుతారా? అని ప్రశ్నించారు. సర్పంచ్‌లు తమ పరువు కోసం సీసీ రోడ్లు వేస్తే, ఇతర అభివృద్ధి పనులు చేస్తే బీర్ సీసాలు అమ్ముకోమని చెబుతారా? అన్నారు.

More Telugu News