‘నిన్న 39 మంది పసికందులు.. నేడు 36 మందే.. రేపటికి ఎంతమంది ఉంటారో’... గాజాలో ఓ ఆసుపత్రి డాక్టర్ ఆవేదన!
- గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి ఆల్ షిఫా మూత
- కనీస సౌకర్యాలు లేక చనిపోతున్న పసికందులు, రోగులు
- విద్యుత్ లేక పనిచేయని ఇంక్యుబేటర్లు..
- వెచ్చదనం కోసం రోజుల పసిగుడ్డులను పక్కపక్కనే పడుకోబెడుతున్న వైద్యులు
మరో ఆసుపత్రిలో బెడ్ చుట్టూ ఫాయిల్ చుట్టి అందులో పసికందులను పడుకోబెడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఆ బెడ్ పక్కనే వేడి నీళ్ల పాత్రలు పెట్టి వారికి వెచ్చదనం లభించేలా చూస్తున్నామని తెలిపారు. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఓవైపు మందులకు తీవ్ర కొరత ఏర్పడగా.. తాజాగా ఇంధనంలేక విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రి మూతపడిందని ఆల్ షిఫా డైరెక్టర్ ప్రకటించారు. చాలా రోజుల క్రితమే కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఆదివారం వరకూ జనరేటర్లతో నెట్టుకొస్తున్నట్లు తెలిపారు. ఇంధనం కూడా నిండుకోవడంతో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిచిందన్నారు.