KTR: రాసుకోండి... రాజాసింగ్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌లను ఓడిస్తున్నాం: కేటీఆర్

  • గోషామహల్‌లో ఈసారి తామే గెలుస్తామన్న కేటీఆర్
  • హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను, కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడిస్తామని వ్యాఖ్య
  • కామారెడ్డిలో తాను గెలవనని రేవంత్ రెడ్డే చెప్పారన్న కేటీఆర్
KTR saya brs will defeat rajasingh revanth reddy etala rajender

గోషామహల్ నియోజకవర్గాన్ని కూడా ఈసారి తామే గెలుస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము కాలుకు బలపం కట్టుకొని మరీ తిరుగుతామని, 2018లో బీజేపీ గెలిచింది రాజాసింగ్ సీటు ఒక్కటేనని, ఈసారి అక్కడ కూడా కొడతామని (గెలుస్తాం) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బరాబర్ కాలికి బలపం కట్టుకొని తిరిగి ఓడగొడతామని... రాసుకోండి... మోదీ కాదు... ఢిల్లీ నుంచి ఇంకెవరు వచ్చినా బీజేపీ ఈసారి ఒక్క సీటు కూడా గెలవదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తెలంగాణలో గెలిచింది ఒకటేనని (గోషామహల్), ఈసారి అది కూడా గెలవదన్నారు.

డిసెంబర్ 3న ఏమవుతుందో చూడండన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడగొట్టామని, ఈసారి కూడా ఓడిస్తామన్నారు. గోషామహల్‌లో రాజాసింగ్‌ను, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడగొడతాం... ఈ మూడు రాసుకోండి అని మీడియాతో అన్నారు. 'నేను చెప్పిన వీటికి మళ్లీ డిసెంబర్ 3న మాట్లాడుదామని' చెప్పారు. గజ్వేల్ గురించి ప్రశ్నించగా... కేసీఆర్‌పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఎవరైనా ఎగురుతామనుకుంటే అది వారి ఖర్మ అన్నారు.

కామారెడ్డిలో తాను గెలవనని రేవంత్ రెడ్డే ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో చెప్పారన్నారు. అక్కడ రేవంత్ గెలవడు కానీ బిల్డప్ కోసం పోటీ చేస్తున్నాడన్నారు. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డి మీద ఓడిపోతే తనను తిడతారని, కనీసం కామారెడ్డిలో కేసీఆర్‌పై ఓడిపోతే చెప్పుకోవడానికి బాగుంటుందని పోటీ చేస్తున్నారన్నారు. కొడంగల్‌లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా? అని కేటీఆర్ అన్నారు. ఆయనను సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలు తిరస్కరించారన్నారు.

More Telugu News