Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో నేడు తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

  • బస్తర్ సహా 20 నియోజకవర్గాలకు పోలింగ్
  • నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకే ఓటింగ్
  • తొలి విడత బరిలో 223 మంది అభ్యర్థులు 
Chhattisgarh to go to polls today

ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేడు (మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమవనుంది. నక్సల్స్‌ ప్రభావిత బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్స్‌గా విభజించారు. మొదటి స్లాట్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక రెండో స్లాట్‌లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. 

ఇక ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పకడ్బందీ భద్రతా చర్యలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలి దశ ఎన్నికల్లో బస్తర్, రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాల నుంచి 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40,78,681 మంది ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. ఇందులో 20,84,675 మంది మహిళలు, 19,93,937 మంది పురుషులు, 69 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఓటర్లుగా ఉన్నారు.  

మొదటి దశ పోలింగ్‌లో పలువురు ముఖ్యనేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్ చీఫ్, ఎంపీ దీపక్ బైజ్ (చిత్రకూట్), మంత్రులు కవాసీ లఖ్మా (కొంటా), మోహన్ మార్కం (కొండగావ్), మహ్మద్ అక్బర్ (కవార్ధా), ఛవీంద్ర కర్మతోపాటు పలువురు ముఖ్యనేతలు ఉన్నారు. బీజేపీకి చెందినవారిలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మాజీ మంత్రులు లతా ఉసెండి (కొండగావ్ నియోజకవర్గం), విక్రమ్ ఉసెండి (అంతగఢ్), కేదార్ కశ్యప్ (నారాయణపూర్), మహేష్ గగ్డా (బీజాపూర్), మాజీ ఐఏఎస్ అధికారి నీలకంఠ్ టేకం (కేష్కల్) ముఖ్యమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.

More Telugu News