Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్.. అమితాబ్ బచ్చన్ ఆందోళన

  • కురచదుస్తుల్లో రష్మిక ఉన్నట్టు డీప్ ఫేక్ వీడియో సృష్టించిన నిందితులు
  • వీడియోపై అభిమానుల ఆందోళన
  • నిందితులపై చర్యలు తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ డిమాండ్
Amitabh bachchan raises concern over rashmika mandanna deepfake video

మనుషుల ఊహలకు రూపం ఇస్తున్న కృత్రిమ మేధ సాంకేతికత కొందరి చేతుల్లో వికృత పోకడలకు దారి తీస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణగా నెట్టింట వైరల్ అవుతున్న నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. దీనిపై ఏకంగా అమితాబ్ బచ్చన్ స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

నెట్టింట వైరల్‌గా మారిన ఓ ఫేక్ వీడియోలో నిందితులు, ఏఐ సాయంతో రష్మిక ముఖాన్ని కురచదుస్తులు ధరించిన ఓ మహిళకు మార్ఫింగ్ చేశారు. దీంతో, ఈ వీడియో నెట్టింట ఒక్కసారిగా వైరల్ గా మారి కలకలం రేపింది. 

వీడియోపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన చెలరేగడంతో ఓ జర్నలిస్టు వాస్తవాన్ని బయటపెట్టారు. అది డీప్ ఫేక్ ఏఐ సాంకేతికతతో తయారు చేసినదని నెటిజన్లను అప్రమత్తం చేశారు. మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన వీడియోకు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేశారని వెల్లడించారు. సెలబ్రిటీలను అపఖ్యాతి పాల్జేస్తున్న నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News