dr k laxman: మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది: డాక్టర్ కే లక్ష్మణ్

  • ప్లానింగ్, డిజైన్, నాణ్యతలేమి, నిర్వహణ లోపం వల్ల పిల్లర్ కుంగినట్లు నివేదిక చెప్పిందని వెల్లడి
  • పునాది కింద ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు బలహీనపడ్డాయని నివేదికలో ఉందన్న లక్ష్మణ్
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై 20 అంశాలకు సంబంధించి సమాచారం అడిగితే పన్నెండింటికే సమాచారం ఇచ్చారని నివేదిక తెలిపిందన్న బీజేపీ నేత
Dr K Laxman on Medigadda pillar issue

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర కమిటీ... అధికారుల నుంచి 20 అంశాలపై సమాచారం కోరిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 12 అంశాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చిందని కమిటీ తమ నివేదికలో తెలిపిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. 

ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందన్నారు. ప్లానింగ్, డిజైన్, నాణ్యతలేమి, నిర్వహణ లోపాల వల్ల మేడిగడ్డ ప్రాజెక్టులోని పిల్లర్ కుంగిపోయిందన్నారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు బలహీనపడ్డాయని చెప్పారన్నారు.

ఫౌండేషన్ మెటీరియల్ పటిష్ఠత తక్కువగా ఉండటం కూడా పిల్లర్ కుంగుబాటుకు కారణమని చెప్పారన్నారు. బ్యారేజీ ప్లానింగ్, డిజైనింగ్ సరిగ్గా లేకపోవడం వైఫల్యమని నివేదిక చెప్పినట్లు తెలిపారు. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడుతోందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఒక బ్లాకులో ఉత్పన్నమైన సమస్య మొత్తం బ్యారేజీకే ముప్పు తెచ్చిందన్నారు. సమస్య పరిష్కరించే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించే అవకాశం లేదని కమిటీ తెలిపిందన్నారు. మొత్తం బ్లాకులను పునాదుల నుంచి తొలగించి తిరిగి నిర్మించాలని సూచించినట్లు చెప్పారు.

More Telugu News