Telangana Assembly Election: నోటిఫికేషన్ జారీతో తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం: ఎన్నికల అధికారి వికాస్ రాజ్

  • అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చునన్న వికాస్ రాజ్
  • డిపాజిట్ మాత్రం ఒక్కదానికే చెల్లించాలన్న ఎన్నికల అధికారి
  • అదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లను స్వీకరిస్తామని వెల్లడి
Telangana EC on election notification

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చునని, డిపాజిట్ మాత్రం ఒక్కదానికే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. నోటిఫికేషన్ జారీతో తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైనట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చునన్నారు. అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. 

అక్టోబర్ 31వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు ముందుగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెల 30న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగతా చోట్ల ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. 

ఇప్పటికే రెండువేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందని, ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల యువత ఓటు హక్కును నమోదు చేసుకుందన్నారు.

రూ.453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

ఇప్పటి వరకు రూ.453 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని వికాస్ రాజ్ తెలిపారు. 362 కేసులు, 256 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. సీ విజన్ యాప్ ద్వారా 2,487 ఫిర్యాదులు అందాయన్నారు. 205 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న నగదు వంటి వాటికి తగిన ఆధారాలు ఉంటే కనుక జిల్లా కమిటీల ద్వారా త్వరగా విడుదల చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు.

More Telugu News