G. Kishan Reddy: ఎన్నికల ప్రచారం కోసం... బండి సంజయ్‌కి ప్రత్యేక హెలికాప్టర్ కేటాయింపు!

  • కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్‌లకు ప్రచార నిమిత్తం రెండు హెలికాప్టర్లు
  • 15వ తేదీ నుంచి జోరుగా ప్రచారం నిర్వహించనున్న బీజేపీ
  • ఈ నెల 7, 11, 19 తేదీల్లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ
BJP leaders to get helicoptors for campaign

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రానున్నారు. 7వ తేదీతో పాటు 11వ తేదీన నిర్వహించే సభలోనూ ఆయన పాల్గొంటారు. ఈ తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అమిత్ షా ఇటీవల సభలో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు.

నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 15వ తేదీ నుంచి జోరుగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేయనున్నారు. 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ఉద్ధృతమయ్యాక 19న మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు.

మరోవైపు, తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర నేతలు జోరుగా ప్రచారం చేసేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కి ప్రత్యేక హెలికాప్టర్ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు ముగ్గురికి... మరో రెండు హెలికాప్టర్లు ఇవ్వనున్నారని చెబుతున్నారు. బండి సంజయ్‌‌కి పూర్తిగా ఒక హెలికాప్టర్ కేటాయించగా, మిగిలిన ముగ్గురు నాయకులకు రెండు హెలికాప్టర్లను ప్రచారం కోసం కేటాయించనున్నారని చెబుతున్నారు.

More Telugu News