ఖమ్మంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న జలగం..!
- కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావు
- బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు
- రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న నేత
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీలో చేరిన జలగం వెంకట్రావు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. అధికార పార్టీలో జలగం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలని జలగం నిర్ణయించుకున్నారు. తన అనుచరులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశమై చర్చించి కాంగ్రెస్ నేతలకు ఓకే చెప్పారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఆ టికెట్ ను జలగం వెంకట్రావుకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.