70 Hour: వారానికి 70 గంటలు పనిచేస్తే వచ్చే అనర్థాలు ఇవీ..!

  • ఎక్కువ గంటల పాటు  కూర్చున్నా, నించున్నా అనర్థాలు
  • కండర వ్యవస్థ దెబ్బతినే రిస్క్
  • మధ్యలో విరామం ఉండాల్సిందే
  • రాత్రి 8 గంటల నిద్ర చాలా అవసరం 
  • పనికి-జీవితానికి మధ్య సమతుల్యం
 70 Hour Work Week Doctor Explains Impact On Health

యువత వారంలో 70 గంటలు కష్టపడి పనిచేయాలి. ప్రముఖ వ్యాపారవేత్త నారాయణమూర్తి చేసిన సూచన ఇది. దీనిపై భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుండడం చూస్తున్నాం. ఉత్పాదకత విషయంలో భారత్ ప్రపంచంలో దిగువన ఉందని, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే, మరింత ఉత్పాదకత దిశగా యువత ఎక్కువ సమయం పాటు కష్టపడాలన్నది నారాయణమూర్తి ఉద్దేశ్యంగా ఉంది. ఎంత సమయం అన్నది కాకుండా, స్మార్ట్ గా, ఉత్పాదకత పెంపు దిశగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. నారాయణమూర్తి చెప్పినట్టు వారానికి 70 గంటలు పనిచేస్తే, అది ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతుందని వైద్యులు అంటున్నారు. 

వారానికి 70 గంటలు అంటే రోజులో 12 గంటలు సుమారు పనిచేయాలి. అన్నేసి గంటలు పనిచేస్తే ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ గంటల పాటు కూర్చుని లేదంటే నించుని పనిచేయడం వల్ల అది మన మస్కులోస్కెలటల్ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల వెన్ను నొప్పి లేదా నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయంటున్నారు. చక్కని మస్కులోస్కెలటల్ (కండర వ్యవస్థ) ఉండాలంటే పనిలో మధ్య మధ్యలో విరామం ఉండాలి. 

ఎక్కువ గంటల పాటు పనిచేయడం వల్ల అది మనం తీసుకునే ఆహారం, నిద్రపై ప్రభావం చూపుతుంది. తీసుకునే ఆహారం మారుతుంది. వేళల్లోనూ మార్పు కనిపిస్తుంది. దీనివల్ల పోషకాల లేమి ఏర్పడుతుంది. ఎక్కువ గంటల పాటు పనిచేయడం వల్ల నిద్ర నాణ్యతపైనా ప్రభావం పడుతుంది. అది పలు అనారోగ్యాలకు కారణమవుతుంది. ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది. ముఖ్యంగా ఎన్ని గంటలు పని చేసినా రాత్రి నాణ్యమైన నిద్ర లభించినప్పుడే అనర్థాలు లేకుండా చూసుకోవచ్చు.

ఎక్కువ గంటల పాటు పనిచేయడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, మానసిక అనారోగ్య సమస్యలు (ఆందోళన, కుంగుబాటు) వస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పనితోపాటు, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవాలి. ఎన్ని గంటల పాటు పనిచేయవచ్చన్నది వ్యక్తులను బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఎన్ని గంటలు పనిచేసినా, మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. ఆరోగ్యాన్నిచ్చే పోషకాహారం తీసుకోవాలి. రోజులో రాత్రి 8 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

More Telugu News