Israel: జైళ్లలోని పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే బంధీలను వదిలేస్తాం: హమాస్ ప్రకటన

Hamas announced Free all Palestinian Prisoners In Exchange For Hostages
  • అందరినీ విడుదల చేయాలని ఇజ్రాయెల్‌కు అల్టిమేటం 
  • ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన
  • గాజాలో గ్రౌండ్ దాడులు ఉధృతమైన నేపథ్యంలో ప్రకటన
ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లు అందరినీ విడుదల చేస్తే తమ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడిచిపెడతామని ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటించింది. గాజాలో గ్రౌండ్ దాడులు ఉధృతమవ్వడం, గాజా యుద్ధభూమిగా మారిపోయిందంటూ ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో హమాస్ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.

ఇజ్రాయెల్‌తో ‘తక్షణ ఖైదీల మార్పిడి’కి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ నేత యాహ్యా సిన్వార్ ప్రకటించారు. ఈ మేరకు ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధమని తెలిపారు. మరోవైపు రష్యా అభ్యర్థన మేరకు రష్యా-ఇజ్రాయెల్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఇద్దరు బంధీలు ఎక్కడ ఉన్నారో గుర్తించే పనిలో ఉన్నామని మరో ప్రకటనలో హమాస్ వెల్లడించింది. వారిద్దరిని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా హమాస్‌తో రష్యాకు సత్సంబంధాలు ఉన్నాయి. దానిని ఉగ్రవాద సంస్థగా పరిగణించడం లేదు. బంధీల విడుదలకు రష్యా దౌత్యవేత్తలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారు.

మరోవైపు.. గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ విరుచుకుపడ్డారు. సైనిక దాడులను ఆయన తప్పుబట్టారు. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ స్పందించింది. టర్కీలోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిచింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను పున:పరిశీలించే వరకు అక్కడి దౌత్య ప్రతినిధులు అందరూ వెనక్కి వచ్చేయాలంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్  ‘ఎక్స్’లో పోస్ట్ ద్వారా ప్రకటించారు.
Israel

More Telugu News