Team India: ఇంగ్లండ్‌పై ఆడబోయే తుది జట్టుపై కేఎల్ రాహుల్ క్లారిటీ.. ఆ ఆటగాడికి మళ్లీ అవకాశం!

KL Rahul hints on Suryakumars inclusion against england
  • పాండ్యా గాయం కారణంగా సూర్య కుమార్‌కు చోటు
  • అతడిపై నమ్మకం ఉంచుతామని కేఎల్ రాహుల్ వెల్లడి
  • ఇంగ్లండ్‌పై సేమ్ టీమ్‌‌ను కొనసాగిస్తామని క్లారిటీ
వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న టీమిండియా, వరుస పరాజయాలతో సతమతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మధ్య నేడు(ఆదివారం) వరల్డ్ కప్‌లో కీలకమైన సమరం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు మరింత చేరువ అవ్వాలని భారత్ యోచిస్తోంది. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే భారత్ బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కొన్ని సంకేతాలు ఇచ్చాడు.

ఇంగ్లండ్‌పై అదే టీమ్‌ను కొనసాగించనున్నామని, తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు ఉంటుందని రాహుల్ ధృవీకరించాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం జట్టుకు కొంత లోపమేనని అభిప్రాయపడ్డారు. పాండ్యాకు గాయమవ్వడం దురదృష్టకరమని, ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలిపాడు. బహుశా సూర్యకు ఛాన్స్ దక్కుతుందని, సూర్య ఎలా ఆడగలడో తమకు తెలుసని, కాబట్టి హార్దిక్ తిరిగి జట్టులోకి వచ్చేవరకు సూర్యపై నమ్మకం ఉంచుతామని స్పష్టం చేశాడు. ఇక టీమిండియా తొలి ఐదు మ్యాచ్‌లు ఛేజింగ్ చేసి గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ అవకాశం వస్తే మంచిదని, మొదటి ఇన్నింగ్స్ సవాలును ఏవిధంగా ఎదుర్కోవాలో తెలుసుకుంటామని అన్నాడు. లక్నోలో ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశంలో ఈ విధంగా స్పందించాడు. 

కాగా.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తుదిజట్టులో చోటు దక్కించుకొన్నారు. కాగా మొత్తం 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో ఇండియా రెండవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లనుంది.
Team India
Cricket
BCCI

More Telugu News