USA: గుండెపోటుతో అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Telugu student dies of heart attack in America
  • ఉదయం నడుచుకుంటూ వెళ్తుండగా హార్ట్ స్ట్రోక్
  • గుర్తించి మార్చురీకి తరలించిన పోలీసులు
  • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి తన కలలు నెరవేరకముందే కన్నుమూసిన విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ ప్రాంతానికి చెందిన గడ్డం వినీత్ గుండెపోటుతో న్యూయార్క్‌లో చనిపోయాడు. ఈ నెల 18న న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తూ వినీత్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణాలు కోల్పోయి రోడ్డుపై పడివున్న అతడిని అక్కడి పోలీసులు గుర్తించి మార్చురీకి తరలించారు. కొన్ని రోజులపాటు వినీత్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ వినీత్ స్నేహితుడైన తమిళనాడు వ్యక్తి పళనికి సమాచారం ఇచ్చారు. అతడు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హార్ట్ అటాక్‌తో (కార్డియాస్ట్రోక్) మృతి చెందిన ఓ భారతీయుడి మృతదేహం మార్చురీలో ఉందని తెలపడంతో వెళ్లి చూసిన పళని అతను వినీత్ అని గుర్తించాడు.

కొడుకు మరణవార్త విన్న వినీత్ తల్లిదండ్రులు గడ్డం బాలేశం, వరలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలేశం కుటుంబం మనోహరాబాద్ ప్రాంతానికి చెందినవారు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. బోయినపల్లిలోని హనుమాజీ కాలనీలో నివాసముంటున్నారు. తండ్రి క్యాబ్ డ్రైవర్ కాగా, తల్లి ఓ దుకాణంలో రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పులు చేసి మరీ కొడుకుని అమెరికా పంపిస్తే ఇలా జరిగిందని వాపోతున్నారు.కాగా మృతదేహం తరలింపునకు సాయం చేయాలంటూ కేంద్రమత్రి కిషన్‌రెడ్డి, మరో ఇద్దరు మంత్రులకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ వారు ఏర్పాట్లు చేయడంతో మృతదేహాన్ని తరలిస్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ శుక్రవారం అర్ధరాత్రి బయలుదేరింది.
USA
Telangana

More Telugu News