Israel: ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెరెస్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఆగ్రహం.. రాజీనామా చేయాలని డిమాండ్

  • గాజాపై ఇజ్రాయెల్ దాడి అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనే అన్న గుటెరెస్
  • మీరు ఏ ప్రపంచంలో బతుకుతున్నారంటూ ఇజ్రాయెల్ మండిపాటు
  • హమాస్ దాడుల్లో తమ దేశ పిల్లలు, ప్రజలు చనిపోయారని ఆగ్రహం
Israel Demands UN Chief Resignation

ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ పై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గాజాలో అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించడమే దీనికి కారణం. 


ఐక్యరాజ్యసమితిలో గుటెరెస్ మాట్లాడుతూ... గాజాలో అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన జరుగుతోందనే విషయం క్లియర్ గా కనపడుతోందని అన్నారు. అంతర్జాతీయ మానవతా చట్టాలకు ఏ ఆయుధ పోరాటం కూడా ఎక్కువ కాదని చెప్పారు. హమాస్ చేసిన దాడులు ఒక్కసారిగా జరిగినవి కాదని... గత 56 ఏళ్లుగా పాలస్తీనీలు దారుణమైన ఆక్రమణను అనుభవిస్తున్నారని చెప్పారు. ఇజ్రాయెల్ వెంటనే కాల్పులను విరమించాలని అన్నారు. 

గుటెరెస్ చేసిన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కోహెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుటెరెస్ పై వేలెత్తి చూపుతూ... ఆయనపై మండిపడ్డారు. మిస్టర్ సెక్రెటరీ జనరల్, మీరు ఏ ప్రపంచంలో బతుకుతున్నారని ప్రశ్నించారు. హమాస్ చేసిన సింగిల్ అటాక్ లో తమ దేశానికి చెందిన ఎంతో మంది పిల్లలతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గాజా ఆక్రమణ కోసమే ఈ దాడులు అనే వ్యాఖ్యలపై కోహెన్ స్పందిస్తూ... 2005లో పాలస్తీనీయులకు గాజాను చివరి మిల్లీమీటర్ వరకు ఇజ్రాయెల్ అప్పగించిందని చెప్పారు. 

మరోవైపు, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... గుటెరెస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిలో కనీసం 1,400 మంది చనిపోయారు. 220 మందికి పైగా ప్రజలను బందీలుగా తీసుకెళ్లారు. దీంతో గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటి వరకు కనీసం 5,700 మంది పాలస్తీనీలు ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యారు.

More Telugu News