Eatala Rajendar: గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై ఈటల పోటీ... బీజేపీ సాహసోపేత నిర్ణయం

  • నవంబరు 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • 52 మందితో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ
  • హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ ఈటల పోటీ
Eatala will contest from Gajwel too

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 52 మందితో తొలి జాబితా ప్రకటించింది. ఆశ్చర్యకరంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు రెండు చోట్ల పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ అధిష్ఠానం కల్పించింది. సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ ఈటల పోటీ చేస్తున్నారు. గజ్వేల్ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం అని తెలిసిందే. 

కేసీఆర్ సొంత నియోజవకర్గంలో ఈటలను బరిలో దింపడం ద్వారా బీజేపీ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని ఈటల కొంతకాలంగా సవాళ్లు విసురుతున్నారు. కేసీఆర్ పై పోటీ అంటే ఈటల సత్తాకు పరీక్ష మాత్రమే కాదు, బీజేపీకి కూడా ప్రతిష్ఠాత్మకమైన అంశం. మరో విషయం ఏమిటంటే... కేసీఆర్ పై పోటీ చేసేందుకు ఈటల తప్ప మరో అభ్యర్థి తెలంగాణ బీజేపీలో లేరా అనే అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. 

సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తుండగా... కామారెడ్డిలో ఆయనపై బీజేపీ కె.వెంకటరమణారెడ్డిని బరిలో దింపుతోంది. మొత్తమ్మీద కేసీఆర్ పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది.

More Telugu News