Virat Kohli: సాదాసీదాగా సాగుతున్న మ్యాచ్ భలే రంజుగా మారింది... దటీజ్ కోహ్లీ!

  • వరల్డ్ కప్ లో నిన్న టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్
  • 7 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గిన టీమిండియా
  • అద్భుత సెంచరీతో అలరించిన కోహ్లీ
Kohli changes match into high tension in order to make century

సాధారణంగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా భారత్ పై ఆడుతున్నప్పుడు ఆ పోకడలు ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో మైదానంలో జరిగిన కొన్ని ఘటనలతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే కాస్త పౌరుషంతో కూడిన పోరాటం కనిపించడం కామన్ గా మారింది. 

టీమిండియాపై గెలిచిన ఒకటీ అరా మ్యాచ్ ల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, వారి అభిమానులు నాగిని డ్యాన్సులతో భారత ఆటగాళ్లను, అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం టీవీల్లో కనిపించింది. కానీ వరల్డ్ కప్ లో భాగంగా నిన్న పూణేలో జరిగిన లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ముఖంలో కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు. 

మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను 256 పరుగులకు కట్టడిచేసిన టీమిండియా, ఆ తర్వాత అత్యంత సాధికారికంగా లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ చూశాక బంగ్లాదేశ్ ఓటమి దాదాపు ఖాయమని తేలింది. 

ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాక ఇక మ్యాచ్ లో చూడ్డానికేమీ లేదు... ఎలాగూ భారత్ గెలుస్తుంది కదా అన్న ఫీలింగ్ అభిమానుల్లో కలిగింది. పైగా కేఎల్ రాహుల్ కూడా వికెట్ అప్పగించేందుకు సిద్ధంగా లేనన్న సంకేతాలను బంగ్లా బౌలర్లకు బలంగా పంపాడు. అప్పటికి భారత్ సాధించాల్సిన పరుగుల కంటే బంతులు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి. భారత్ విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. దాంతో మ్యాచ్ సాదాసీదాగా అనిపించింది. 

కానీ, కోహ్లీ ఎప్పుడైతే 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దకు చేరుకున్నాడో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికి టీమిండియా విజయం కోసం కేవలం 19 పరుగులే అవసరం... అటు, కోహ్లీ సెంచరీకి కూడా 19 పరుగులే కావాలి. ఇంకేముంది, నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ప్రోత్సాహంతో కోహ్లీ సెంచరీ చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నాడు. 'మిషన్ 100 రన్స్' పై ఫోకస్ చేశాడు. 

అప్పటిదాకా ఓ మోస్తరుగా సాగుతున్న మ్యాచ్ కాస్తా ఉత్కంఠభరితంగా మారింది. కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకుంటాడా, లేదా అంటూ  అభిమానుల్లో ఆసక్తి పీక్స్ కు చేరింది. మ్యాచ్ లో విజయం సంగతి అటుంచి అందరి దృష్టి కోహ్లీ సెంచరీపైనే పడింది. కానీ, కోహ్లీ అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ, తన ట్రేడ్ మార్క్ షాట్లతో సెంచరీని అందుకుని ఔరా అనిపించాడు. ఈ దశలో కోహ్లీ కొట్టిన ఒక్కో షాట్ కు ప్రేక్షకుల హోరుతో మైదానం మార్మోగిపోయింది. 

చివర్లో బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అల్పబుద్ధితో వైడ్ విసిరే ప్రయత్నం చేసినా, అంపైర్ దాన్ని వైడ్ ఇవ్వలేదు. అదే ఓవర్లో మూడో బంతికి భారీ సిక్స్ కొట్టిన కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు, టీమిండియాకు వరల్డ్ కప్ లో నాలుగో విజయాన్ని అందించాడు.... దటీజ్ కింగ్ కోహ్లీ అనిపించాడు.

More Telugu News