రాహుల్ జీ.. మంథని దాకా వెళ్లారు.. పక్కనే ఉన్న అద్భుతాన్ని చూసి తరించండి: కేటీఆర్ సలహా

KTR suggests Rahul Gandhi to visit Kaleswaram project
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం చూడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. దేశానికే కాళేశ్వరం ఒక టీచింగ్ పాయింట్ అని చెప్పారు. మంథని వరకు వెళ్లారు.. ఆ పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును కూడా చూసి తరించాలని అన్నారు. దేశ సాగునీటి రంగ చరిత్రలోనే.. అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండని చెప్పారు. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి... బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండని అన్నారు. 

నీళ్లు పల్లమే కాదు.. బలమైన సంకల్పం ఉంటే... ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోండని చెప్పారు. పాతాళంలో ఉన్న గోదావరి నీటిని.. ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండని తెలిపారు. మొగులు వైపు చూసే దిగులు లేకుండా.. లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూడాలని... చూసి నేర్చుకోవాలని చెప్పారు. 

అరవై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో.. అన్నదాతను అరిగోస పెట్టినందుకు.. సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు.. తెలంగాణ రైతుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అని.. అర్థంలేని ఆరోపణలు చేసినందుకు అక్కడే గట్టిగా లెంపలేసుకోండని అన్నారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా.. కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండని చెప్పారు. సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని మీరు మరో వంద జన్మలెత్తినా సాధించలేరని ఇప్పటికైనా ఒప్పుకోండని అన్నారు.
Go Back to Shorts
KTR
BRS
Rahul Gandhi
Congress
Kaleswaram Project

More Telugu News