ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి.. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు గవర్నర్లు
- గతంలో నాదెండ్ల భాస్కరరావును ఓడించిన చరిత్ర ఇంద్రసేనారెడ్డిది
- ఏబీవీపీ ద్వారా ఇంద్రసేనారెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభం
- ఇప్పటికే గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ
ఇంద్రసేనారెడ్డిది సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామం. ఆయన రాజకీయ ప్రస్థానం ఏబీవీపీతో మొదలయింది. ఏబీవీపీలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పని చేశారు. ఆ తర్వాత బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనది.
1983లో తొలిసారి మలక్ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇంద్రసేనారెడ్డి గెలుపొందారు. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న ప్రభాకర్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1985లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును ఓడించారు. 1999లో మూడోసారి గెలిచి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 2003 నుంచి 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
మరోవైపు ఒడిశా గవర్నర్ గా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను నియమించారు. ఇంకోవైపు ఇప్పటికే తెలంగాణకు చెందిన మరో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే.