ట్రంప్ వ్యాఖ్యలు సిగ్గు చేటు: ఇజ్రాయెల్
- ఇజ్రాయెల్ పోరాట స్ఫూర్తిని కించపరిచేలా ఉందని వ్యాఖ్య
- ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాని ప్రశంసించిన ట్రంప్
- తాను అధ్యక్షుడిగా ఉంటే ఇజ్రాయెల్ పై దాడిని నిరోధించేవాడినని వెల్లడి
బుధవారం వెస్ట్ పామ్ బీచ్ లో జరిగిన ర్యాలీలో భాగంగా ట్రంప్ ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ బలహీనతలను బహిరంగ పరిచినందుకు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఆయన విమర్శించారు. ఇది హిజ్బుల్లాను దాడులకు ప్రేరేపించినట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ శత్రువుగా భావించే హిజ్బుల్లా నేతలను ఎంతో స్మార్ట్ గా అభివర్ణించారు. ‘‘నెతన్యాహు భంగపడ్డారు. అయన సన్నద్ధంగా లేరు. ఇజ్రాయెల్ సన్నద్ధంగా లేదు’’ అని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఇజ్రాయెల్ పై ఉగ్రదాడిని ముందుగానే పసిగట్టి, నిరోధించేవాడినన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ప్రమాదకరంగా, అర్థంలేనివిగా ఉన్నాయని వైట్ హౌస్ డిప్యూటీ సెక్రటరీ ఆండ్య్రూ బేట్స్ పేర్కొన్నారు. ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థని స్మార్ట్ గా ఏ అమెరికన్ అయినా పేర్కొనడం మతిలేని చర్యగా వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీలోని ట్రంప్ వ్యతిరేకులు సైతం ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతుండడం గమనార్హం.