Komatireddy Raj Gopal Reddy: నేను పార్టీ మారటం లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Komatireddy rajagopal reddy rubbishes rumours of him leaving bjp
  • బహుజన తెలంగాణ దిశగా ఓ సైనికుడిలా పార్టీతో కలిసి పనిచేస్తానని స్పష్టీకరణ 
  • తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన తెచ్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని వ్యాఖ్య
  • ప్రజాపాలన కోసమే తాను గతేడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడి
తాను బీజేపీని వీడుతున్నట్టు వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తల్ని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య, బహుజన రాజ్యం కోసం బీజేపీలో చేరానని అన్నారు. 

ప్రజా తెలంగాణకు బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్టు ప్రస్తుత పరిస్థితి తయారైందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజాపాలకుడిలా కాక నిజాం రాజులా నియంతృత్వ పోకడలు పోతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రజారాజ్యం ఏర్పాటు కోసమే తాను గతేడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానని గుర్తు చేశారు. దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ముందుకు నడిపించే శక్తి ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షా‌కు ఉందని తెలిపారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టి కుటుంబ తెలంగాణకు బదులు బహుజన తెలంగాణ ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. ఈ దిశగా పార్టీలో సైనికుడిలా ముందుకు కదులుతానని స్పష్టం చేశారు.
Komatireddy Raj Gopal Reddy
BJP
Telangana
BRS
KCR

More Telugu News